తల్లి మానసిక స్థితి సరిగాలేకే చిన్నారిని చంపేసింది..

తల్లి మానసిక స్థితి సరిగాలేకే చిన్నారిని చంపేసింది..
  • కొడుకును మంటల్లో వేసిన ఘటనలో పోలీసుల ప్రాథమిక నిర్ధారణ 

జీడిమెట్ల, వెలుగు: రెండు నెలల చిన్నారిని మంటల్లో వేసిన ఘటనలో తల్లి మానసిక పరిస్థితి సరిగా లేనందు వల్లే దారుణానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌‌ నియోజకవర్గం బౌరంపేట్‌లో చిన్నారి మృతి కేసులో తల్లి మమతను అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.

మధ్యప్రదేశ్‌ బీనా స్టేషన్‌సాగర్‌‌ నవ్వగావ గ్రామానికి చెందిన భర్త రాజేంద్ర ( 21), మమత (20) రెండు నెలల కింద హైదరాబాద్‌కొచ్చి బౌరంపేట్‌లో ఉంటున్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. బాబు మంగళవారం గుక్కపెట్టి ఏడుస్తుండటంతో విసుగెత్తిపోయింది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి పక్కనే ఉన్న కట్టెల పొయ్యిలో పడేసింది.

ఆ సమయంలో పని నుంచి ఇంటికొచ్చిన రాజేంద్ర వెంటనే బయటకు తీసి చూడగా, అప్పటికే చిన్నారి చనిపోయాడు. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితురాలి మానసిక పరిస్థితి సరిగాలేకపోవడం, బాబు తరుచూ ఏడుస్తుండటం, భర్త పనికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడి, అసహనంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు.